చిరంజీవి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారు... రెండ్రోజుల్లో పరిష్కారం: దిల్ రాజు

  • చిరంజీవిని కలిసిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు
  • చిరంజీవి దృష్టికి పర్సంటేజీ విధానం
  • చిరంజీవి అన్ని విషయాలను సానుకూలంగా విన్నారన్న దిల్ రాజు
పర్సంటేజీ విధానం కేవలం 'పెద్ది'కి సంబంధించినది మాత్రమే కాదని, పరిశ్రమకు సంబంధించినదని తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఉన్న పర్సంటేజీ విధానానికి సంబంధించిన సమస్య రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

చిరంజీవిని కలిసిన వారిలో నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్ తదితరులు ఉన్నారు. దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావాలని నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారని తెలుస్తోంది. అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు అన్ని విషయాలను చిరంజీవికి వివరించారని, ఆయన అన్ని అంశాలను సానుకూలంగా విన్నారని తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తెప్పించుకుంటానని మెగాస్టార్ చెప్పారని అన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివరాలను ఛాంబర్ ప్రకటిస్తుందని అన్నారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల సమస్యలను చిరంజీవి దృష్టికి తీసుకువెళితే, ఆయన ఆవేదన వ్యక్తం చేశారని తెలంగాణ ఎగ్జిబిటర్ల కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీని కూడా పిలిచి మాట్లాడతానని చిరంజీవి చెప్పారని అన్నారు.

Dil Raju
Telangana FDC
Chiranjeevi
Telugu Film Industry
Exhibitors
Producers
Percentage System

More Telugu News